Sunday, January 11, 2015

వంటిల్లే ఫార్మసీ…Swami Vivekananda Quotes Telugu


వంటిల్లే ఫార్మసీ…
★★★★★★★
అత్యంత ప్రాచీనమైనది ఆయుర్వేదం. అలనాటి ఆయుర్వేద
భిషగ్వరేణ్యుల అపార అనుభవసారాన్ని ఉపయోగించుకుంటే మీరు మాటిమాటికీ
మందుల షాపు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మీరు మీ ఇంటి
డ్రాయింగ్ రూమ్ నుంచి కిచెన్ వరకు నడిస్తే చాలు… ఎన్నెన్నో పెద్ద
రోగాలూ మాయమవుతాయి. ఎందుకంటే మీ కిచెన్ను మించిన క్లినిక్
లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మనకు కిచెనంత దూరంలోనే అత్యంత
చేరువగా ఉన్న ద్రవ్యాలతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో
తెలుసుకునేందుకే ఈ కథనం.
ఎన్నో పరిశోధనల తర్వాత రుషిపుంగవుల
సిద్ధాంత సూత్రాల్లో రుషులు చెప్పిన
సిద్ధాంతాల్లో మచ్చుకు ఒకటి…
‘‘జగత్యేవమ్ న ఔషధమ్ నకించిత్
విద్యతే ద్రవ్యమ్…’’ అంటే… ‘ఈ
విశ్వంలో ఔషధానికి పనికిరాని
ద్రవ్యం అంటూ లేనే లేద’ని అర్థం.
వంటింట్లోని
వస్తువులూ ఇందుకు మినహాయింపు కాదు. చీటికీ మాటికీ డాక్టర్ల
చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నిత్యం వాడుకునే మసాలాద్రవ్యాలనే
వ్యాధి నిరోధకాలుగా, ఔషధాలుగా ఎలా వాడుకోవచ్చో చెప్పడానికి కొన్ని
ఉదాహరణలు.
పసుపు (హరిద్రా):
జలుబు, రొంప చేసినప్పుడు వేడి వేడి పాలల్లో చిటికెడు పసుపు,
చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. పసుపుకొమ్మును కాల్చి, ఆ
పొగను పీలిస్తే ముక్కుదిబ్బడ నయమవుతుంది. పసుపుముద్దను పుదీనా రసంలో
కలిపి, రాత్రి పడుకునేప్పుడు మొటిమలపై రాస్తే కొన్నాళ్లకు అవి
తగ్గిపోతాయి. బహిష్టు తర్వాత పసుపు, తేనె, నెయ్యి కలిపి సేవిస్తే
గర్భాశయ శుద్ధి కలుగుతుంది. పసుపుకు యాంటీసెప్టిక్ గుణం కలిగి ఉంది కనుక,
తాజాగా ఉన్న గాయాలపై రాస్తే రక్తస్రావం ఆగిపోయి, గాయం త్వరగా
మానుతుంది. దీనికి యాంటిబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్నాయని
ఆధునిక పరిశోధనల్లోనూ విదితమైంది.
వెల్లుల్లి (లశున):
దీనిలో లవణరసం తప్ప మిగిలిన ఐదు రసాలు ఉంటాయి. (అంటే… మధుర,
అమ్ల, కటు, తిక్త, కషాయ రసాలు). రెండు మూడు వెల్లుల్లి రేకలను దంచి
కప్పుడు పాలల్లో మరిగించి, కొంచెం చక్కెర కలుపుకుంటే దాన్ని ‘లశునక్షీరం’
అంటారు. వారానికి రెండు, మూడుసార్లు పరగడుపున ఒక కప్పు తాగితే వ్యాధి
నిరోధకశక్తి పెరుగుతుంది. తరచూ కనిపించే ఇన్ఫెక్షన్స్ (ముఖ్యంగా
గొంతునొప్పి)ను ఇది దరిచేరనివ్వదు. వెల్లుల్లి రక్తంలో
కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బీపీని నియంత్రిస్తుంది.
జీర్ణక్రియను బాగుచేసి, విరేచనాలను నివారిస్తుంది. లశునక్షీరం – దగ్గు,
జలుబులకు మంచి నివారణ. కీళ్లనొప్పులు, గుండెజబ్బులు కూడా తగ్గుతాయి.
నువ్వుల నూనెలో వెల్లుల్లి రేకల్ని మరిగించి, చల్లార్చి, రెండు చుక్కలు చెవిలో
వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
ఉల్లిపాయ (పలాండు):
రెండు చెంచాల ఉల్లిరసానికి తేనె, నెయ్యి, బెల్లం సమానంగా కలిపి
నిత్యం సేవిస్తే పురుషుల్లో శుక్రం అభివృద్ధి చెందుతుంది.
ఉల్లిగడ్డను కాల్చి చిటికెడు ఉప్పుతో తింటే జీర్ణశక్తి వృద్ధిచెందుతుంది.
ఉల్లిరసంలో అల్లపురసం, తేనె కలిపి సేవిస్తే జలుబు, రొంప తగ్గుతాయి.
ఉల్లిరసం, నిమ్మరసం ఒక్కొక్క చెంచా కలిపి ప్రతిరోజూ పరగడుపున సేవిస్తే
బరువు తగ్గుతారు. వేసవిలో వడదెబ్బ నుంచి కాపాడుతుంది. దీని రసంలో
కొంచెం ఉప్పు కలిపి, పంటి చిగుళ్లకు పూస్తే దంతమూల రక్తస్రావం తగ్గుతుంది.
అల్లం (అర్ద్రక):
చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి, నిప్పులపై కొంచెం వేడిచేసి
కొంచెం ఉప్పును అద్ది, పరగడుపున నమిలి తింటే జీర్ణకోశ సంబంధిత
వ్యాధులన్నింటినీ పోగొడుతుంది. గొంతుకి ఇన్ఫెక్షన్ రాదు. అల్లానికి
రక్తప్రసరణను పెంచే గుణం ఉంది. దీనివల్ల గుండెకు, మెదడుకు,
మూత్రపిండాలకు, జననాంగాలకు చక్కటి రక్తప్రసరణ జరిగి హార్ట్ఎటాక్ను,
పక్షవాతాన్ని నివారించడానికి ఉపకరిస్తుంది. కిడ్నీల
పనితీరు మెరుగుపడుతుంది. పురుషాంగ స్తంభనకు దోహదపడుతుంది. అల్లాన్ని
పసుపు, తులసిరసంతో సేవిస్తే చర్మరోగాలు ముఖ్యంగా
దద్దుర్లు (అర్టికేరియా) తగ్గిపోతాయి. దీన్ని దంచి, మజ్జిగలో కలిపి
తాగితే వాతవ్యాధులు తగ్గుతాయి. నిమ్మరసంలో కొంచెం సైంధవలవణం కలిపి,
అల్లపు ముక్కలను దాంట్లో వారం రోజులు నాన్చి, ఎండబెడితే ‘భావన అల్లం’
తయారవుతుంది. దీన్ని చప్పరించి నమిలితే అరుచి తగ్గి, ఆకలి పుట్టి,
జీర్ణక్రియ బాగవుతుంది. అల్లపురసం తేనెతో సేవిస్తే దగ్గు,
ఆయాసం తగ్గుతాయి.
కరివేపాకు (కరినింబ):
రోజూ రెండు చెంచాల కరివేపాకు రసం తాగితే మధుమేహ వ్యాధి
నివారణకు ఉపకరిస్తుంది. నరాల బలహీనత తగ్గుతుంది. కడుపులో గ్యాస్
తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణకోశ క్యాన్సర్లను నివారిస్తుంది.
జీరకర్ర (జీరక):
నిమ్మరసంలో కొంచెం సైంధవలవణాన్ని కలిపి,
జీలకర్రను వారం రోజులు నానబెట్టి ఎండిస్తే ‘భావనజీర’ తయారవుతుంది. ఇది
కొంచెం నమిలి చప్పరిస్తే ఆకలిపుడుతుంది. గర్భిణికి కలిగే వాంతులను తగ్గించి
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జీలకర్ర చూర్ణాన్ని పెరుగులో కలిపి సేవిస్తే
నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. జీలకర్రను వేయించి, పొడిచేసి 1-2
గ్రాములు నెయ్యితో కలిపి రోజూ సేవిస్తే బాలింతలకు స్తన్యవర్ధకంగా
పనిచేస్తుంది. జీలకర్ర, ఉప్పు కలిపి నూరి, అందులో తేనె కలిపి, తేలుకుట్టిన
చోట పూతగా పూస్తే ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర, ధనియాలు,
అల్లం కలిపి కషాయం కాచి 30 మి.లీ. రోజూ తాగితే అధిక బీపీ
నియంత్రణలోకి వస్తుంది. ఈ కషాయం వల్ల వైరల్ జ్వరాలు కూడా
తగ్గుతాయి. పైల్స్ (అర్మోరోగం)కి కూడా మంచిది. జీలకర్రలో ఐరన్ ఎక్కువగా
ఉంటుంది.
ధనియాలు:
ధనియాల చూర్ణాన్ని పటికబెల్లంతో కలిపి తింటే అరుచి, అజీర్ణం,
గొంతునొప్పి, జలుబు, రొంప తగ్గుతాయి. గర్భిణులకు వాంతులు తగ్గుతాయి.
కషాయం తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది. జ్వరహరంగా పనిచేస్తుంది.
ధనియాలు, కరివేపాకు, చింతచిగురులను ఎండబెట్టి పొడి చేసి, స్వల్ప
ప్రమాణంలో సైంధవలవణం కలిపి ఆవునెయ్యితో అన్నం మొదటిముద్దతో
తింటే సమస్త జీర్ణకోశవ్యాధులు తగ్గుతాయి.
ఏలకులు (ఏలా):
ఏలకుల చూర్ణాన్ని స్వల్పప్రమాణంలోనే సేవించాలి. పటికబెల్లంతో కలిపి
చప్పరిస్తే నోటి దుర్వాసన పోతుంది. పాలలో మరిగించి, చల్లార్చి తేనెతో
వాడితే పుంసత్వ శక్తికి చాలా మంచిది. నిమ్మరసంతో సేవిస్తే
వాంతులు తగ్గుతాయి. దోసగింజల చూర్ణంతో కలిపి సేవించి అనుపానంగా
పల్లేరు కషాయం తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. మూలవ్యాధికి కూడా
మంచిది. పాలమీగడలో కలిపి ఆ ముద్దను నోటిలో చప్పరిస్తే నాలుక, దవడ
పూత తగ్గుతుంది. ఈ చూర్ణాన్ని బట్టలో పెట్టి వాసన చూస్తే తుమ్ములు,
తలనొప్పి తగ్గుతాయి. మధుమేహానికి కూడా మంచిదే.
గమనిక: కల్తీలేని ద్రవ్యాలను మాత్రమే సమకూర్చుకోవాలి. మేలిమి
ద్రవ్యాలతో మాత్రమే ఔషధ ఫలితాలు లభిస్తాయి. వీటిని వంట
ద్రవ్యాలుగా వంటకాల్లో వాడటం వల్ల అవసరమైనప్పుడు ఔషధంగా అవి
పనిచేయవని కొందరు అపోహ పడుతుంటారు. అది వాస్తవం కాదు.
లవంగాలు (దేవకుసుమ): వీటిని వేయించి, చూర్ణించి (పొడి చేసి) తేనెతో కలిసి
తాగితే దగ్గు, కఫం తగ్గుతాయి. లవంగాలను చల్లని నీళ్లతో నూరి,
వడగట్టి, పటికబెల్లంతో సేవిస్తే కడుపులో మంట తగ్గుతుంది.
గర్భిణీలకు వాంతులు తగ్గుతాయి. లవంగతైలాన్ని పైపూతగా రాస్తే
పిప్పిపన్ను నొప్పి తగ్గుతుంది. నీటితో ముద్దగా చేసి పట్టువేస్తే
తలనొప్పి తగ్గుతుంది.
దాల్చిన చెక్క (త్వక్): దీన్ని చాలా స్వల్పప్రమాణంలోనే ఉపయోగించాలి.
చూర్ణాన్ని సేవిస్తే ఆకలిపుట్టి అజీర్తిని పోగొడుతుంది.
వాయువును హరిస్తుంది. శుక్రాన్ని పెంచుతుంది. రక్తంలో కొవ్వును కరిగిస్తుంది.
ఆవాలు (సర్షప): చాలా పుష్టికరం. ఐరన్, జింక్, క్యాల్షియం, ప్రొటీన్లు,
మాంగనీస్ వంటి పోషకాలకు నిధి. చెంచాడు ఆవనూనెలో ఒక చెంచా తేనె కలిపి
తాగితే ఉబ్బసం (ఆస్తమా) నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్లీహవృద్ధి
(స్ప్లీన్ వ్యాకోచం) తగ్గుతుంది. ఆవచూర్ణంతో ఒంటికి నలుగుపెడితే చర్మానికి
కాంతి వస్తుంది. ఆవనూనె పూస్తే తలమీద వెంట్రుకలు ఒత్తుగా పెరిగి, చుండ్రు,
పేలు పోతాయి. చూర్ణాన్ని బెల్లంతో కలిపి సరైన మోతాదులో వాడితే పిల్లల్లో
పక్కతడిపే అలవాటు (శయ్యామూత్రం-బెడ్వెట్టింగ్) తగ్గుతుంది.
మిరియాలు (మరిచ): ఈ పొడిని పాలు చక్కెరతో సేవిస్తే జలుబు,
దగ్గు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. కంఠశుద్ధి జరుగుతుంది. మిరియాలు,
జీలకర్ర చూర్ణాలను తేనెతో సేవిస్తే పైల్స్ (అర్మోవ్యాధి) తగ్గుతాయి.
తేలు, జెర్రి వంటి విషకీటకాలు కుడితే మిరియాలను ఉల్లిపాయ రసంతో
అరగదీసి చర్మంపై (కుట్టినచోట) పట్టువేయాలి. మిరియాలతో చేసిన
తైలం చర్మరోగాలను తగ్గిస్తుంది. (ఈ తైలాన్ని పైపూతగా వాడాలి).
వాము (అజామోద): దీన్ని పొడిచేసి, సైంధవ లవణంతో కలిపి, నిమ్మరసంతో
సేవిస్తే కడుపునొప్పి తగ్గి, జీర్ణక్రియ పెరుగుతుంది. వాము నమిలితే నోటి
దుర్గంధం పోతుంది. వాముకషాయం తాగితే అజీర్తి విరేచనాలు, నీళ్ల
విరేచనాలు తగ్గుతాయి.
నువ్వులు (తిల): ఆయుర్వేదంలో ‘తైలం’ అంటే నువ్వులనూనె అని అర్థం.
దీన్ని శరీర మర్దనానికి (మసాజ్) వాడవచ్చు. చర్మకాంతి పెరిగి,
బరువు తగ్గుతారు. వాతనొప్పులు తగ్గుతాయి. కడుపులోకి తీసుకోవడం వల్ల
మేదోరోగం (స్థౌల్యం) తగ్గుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. వృద్ధాప్యంలో
వచ్చే ముడుకుల నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది. రెండు చెంచాల నువ్వుల
నూనెలో కొంచెం వేడిచేసిన ఇంగువ కలిపి గ్లాసుడు పాలతో బహిష్టు సమయంలో
తాగితే ముట్టుశూల (నొప్పి) తగ్గుతుంది. నువ్వుల పప్పును బెల్లంతో కలిపి
రోజూ తింటే శరీరానికి చక్కటి శక్తి వస్తుంది. దీంట్లో క్యాల్షియమ్ అధికంగా
ఉంటుంది.
కుంకుమపువ్వు (కుంకుమమ్): ఇది చాలా ఖరీదైన ద్రవ్యం. 200 మి.గ్రా.
ద్రవ్యాన్ని పాలు, చక్కెరతో సేవిస్తే చర్మకాంతి పెరుగుతుంది. రక్తశుద్ధి
చేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. కడుపులో క్రిములు నాశనమవుతాయి.
కంటిచూపు వృద్ధికి ఉపయోగపడుతుంది. శిరోరోగాలను నివారిస్తుంది. మహిళలలో
నెలసరిని చక్కదిద్దుతుంది. పురుషత్వాన్ని పెంచుతుంది. దీనితో తయారుచేసిన
కుంకుమాదిలేపం ఆయింట్మెంట్ ఆయుర్వేద దుకాణాలతో లభిస్తుంది. దీన్ని వాడితే
మొటిమలు, చర్మం మీద రకరకాల మచ్చలు తగ్గి చర్మం నిగనిగలాడుతుంది.
బెల్లం (గుడం): దీంట్లో ఐరన్, క్యాల్షియమ్ మెండుగా ఉంటాయి. బెల్లాన్ని
మిరియాన్ని కలిపి చేసిన పానకం తాగితే ఆకలి పుడుతుంది. పెరుగుతో కలిపి
సేవిస్తే బలం కలుగుతుంది. కొన్నిసార్లు దెబ్బలు తగిలినప్పుడు గాయం కాకుండా
కేవలం వాపు, నొప్పి కలుగుతుంటాయి (స్ప్రెయిన్). ఇలాంటప్పుడు బెల్లం, శుంఠి
చూర్ణం కలిపి తింటే వాతనొప్పులు తగ్గుతాయి. బెల్లం, పసుపు, కొద్దిగా
కరక్కాయ చూర్ణం కలిపి దంచి రెండు గ్రాముల మోతాదులో తియ్యటి
మజ్జిగతో పాటు నిత్యం సేవిస్తే మొలలు (పైల్స్) తగ్గుతాయి.
తేనె (మధు): దీనికే మాక్షిక, క్షాద్ర, సారఘు వంటి పర్యాయపదాలెన్నో
ఉన్నాయి. ఇది రకరకాలైన పుష్పాల మకరందాన్ని తేనెటీగలు సేకరించి ఒక
చోట పొందుపరచడం వల్ల లభించే ద్రవ్యం. కాబట్టి వ్యాధి క్షమత్వక
శక్తిని అమోఘంగా వృద్ధి చేస్తుంది. నవజాత శిశువులకు తేనెను నాకించడంలోని
ఆంతర్యమిదే. ఇది చాలా తేలికగా, శీఘ్రంగా జీర్ణమై, శక్తిని
ప్రసాదిస్తుంది.
సమస్త స్రోతస్సులలోకి అత్యంత వేగంగా చొచ్చుకుపోతుంది. స్థౌల్యాన్ని
పోగొడుతుంది. పరగడుపున నిమ్మరసం, వేడినీళ్లతో కలిపి తాగితే మంచిది.
వీర్యాన్ని, మేధస్సును వృద్ధి చేస్తుంది. కంటిచూపు, శరీరకాంతి
మెరుగుపడతాయి. నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. మొలలు,
దగ్గు, ఆయాసం, కఫం, ఎక్కిళ్లు, తృష్ణ (దప్పిక), కడుపులోని క్రిములు వంటి
వికారాలను తగ్గిస్తుంది. తేనె, సున్నం, కలిపి పట్టువేస్తే వాపులు,
సెగగడ్డలు తగ్గుతాయి. ఆయుర్వేదంలో ఇంచుమించు అన్ని
మందులకు తేనెను అనుపానంగాగాని, సహపానంగా గాని వాడుతారు.
పెరుగు (దధి) / మజ్జిగ (తక్రం): ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి
శ్రేష్ఠం. పెరుగు, మజ్జిగ చాలా బలకరం. పెరుగును మజ్జిగగా చిలికి
వాడటం వల్లనే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మజ్జిగ స్థూలకాయాన్ని
తగ్గిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. సూర్యోదయం కాకుండా తెల్లవారుఝామున
పెరుగన్నం తింటే మైగ్రేన్ తలనొప్పికి మంచి ఉపశమనం లభిస్తుంది.
మజ్జిగ, సైంధవ లవణం, వాముచూర్ణం కలిపి తాగితే ఆర్శమొలల
రక్తస్రావం తగ్గుతుంది. మజ్జిగను బార్లీ నీటితో కలిపి తాగితే మూత్రం సాఫీగా
అయి, మంటను తగ్గిస్తుంది.
గసగసాలు (అహిఫేన బీజాలు): దీన్ని చాలా జాగ్రత్తగా, అతి తక్కువ
మోతాదులో సేవిస్తే అతిసారం తగ్గుతుంది. వీర్యవృద్ధి జరుగుతుంది. ఈ
చూర్ణాన్ని కొబ్బరినూనెలో కలిపి మరిగించి, వడబోసి… ఆ మిశ్రమాన్ని
తలకి రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది. శిరోభారం తగ్గుతుంది. కంటి
చూపు మెరుగుపడుతుంది.
పుదీనా ( పూతిశాక): ఇది స్వల్ప ప్రమాణంలో వాడితే ఆకలి పెరుగుతుంది.
అజీర్తి తగ్గుతుంది. కడుపులో క్రిములు, కడుపునొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
దీని నుంచి తీసిన నూనెను పూతగా పూస్తే కండరాల నొప్పులు
తగ్గుతాయి.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular